కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ పలు రాష్ట్రాలు తమకు లబ్ధి కలిగేలా పేర్లు మార్చి తమ రాజకీయ లబ్ది కోసం ఆయా రాష్ట్రాలలో వేరే పేర్లతో పథకాలను అమలు చేస్తున్నారు.అయితే ఇక పై ఇలా చేయడం కుదరదు. పార్లమెంట్ ఆమోదం పొందిన పథకాల పేర్లను మార్చడం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పాత్రను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేయడమే అవుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పథకాల పేర్లను మార్చే రాష్ట్రాలకు నిధులు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై), ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు పలు రాష్ట్రాలు తమకు అనుకూల పేర్లను పెట్టి అమలు చేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను పంజాబ్ ప్రభుత్వం ‘ఆమ్ ఆద్మీ క్లినిక్’లుగా మార్చింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పీఎంఏవై పథకాన్ని బంగ్లా ఆవాస్ యోజనగా, ఢిల్లీలో దీనిని న్యూఢిల్లీ ఆవాస్ యోజన, ఏపీ లో కొన్ని మార్పులు చేసి జగనన్న కాలనీలు అని పిలుస్తున్నారు. అలాగే తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌ల్లోనూ ఈ పథకం పేరు మార్చారంటూ పలుమార్లు కేంద్ర మంత్రులు విమర్శించడం జరిగింది.
కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రం తన వాటా కొంత మేర కలిపి పూర్తిగా కేంద్రం పేరు ఊసే లేకుండా ఒక సరి కొత్త పథకం లా వీటిని అమలు చేస్తున్నారు . ఇందులో ప్రధానమంత్రి స్వనిది , జల్ జీవం మిషన్ , మధ్యాహ్న భోజన పథకం వంటివి ఉన్నాయి
నిబంధనలు పాటిస్తేనే నిధులు..
ఈ క్రమంలో కేంద్ర పథకాల పేర్లను మార్చకుండా నిబంధనల మేరకు అమలు చేస్తున్న రాష్ట్రాలకే నిధులు పొందే అర్హత ఉంటుందన్న షరతును తప్పకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం.
Leave a Reply