దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా కుల గణన చేపడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కూడా కులాల వారిగా అధికారిక కుల గణన కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నవంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల వారీగా జనగణన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. నవంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల గణన చేపట్టనుంది.
గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ఈ కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే చేపడతారు. రాజకీయ విమర్శలు లేకుండా చూడటానికి ఈ ప్రక్రియలో వాలంటీర్లను దూరంగా ఉంచడం జరిగింది.
AP Caste Census Survey to begin from November 15th
కుల గణన సర్వే కోసం త్వరలో మొబైల్ యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు గ్రామ వార్డు సచివాలయ శాఖ తెలిపింది. నవంబర్ 15 తర్వాత ఆయా గ్రామ సచివాలయాల స్థాయిలో ఉండే ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి ఈ వివరాలను సేకరిస్తారు.
మరింత పారదర్శకత కోసం సచివాలయాల వారిగా సేకరించిన సర్వే పై మండల స్థాయిలో శాంపిల్ గా 10 శాతం ఇళ్లకు సంబంధించిన డేటాను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ ఆధ్వర్యంలో పునః పరిశీలన జరుపుతారు. అదేవిధంగా రెవిన్యూ డివిషన్ స్థాయిలో కూడా స్థానిక ఆర్డిఓ ఆధ్వర్యంలో శాంపిల్ డేటా పునః పరిశీలన చేయడం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన సమాన అవకాశాలు పొందేలా కుల గణన జరపాలని ఇప్పటికే విపక్షాలు, బీసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా వివిధ రాష్ట్రాలు తమంతట తామే కుల గణన చేపడుతున్నాయి. ఇటీవల బీహార్ ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టి గణాంకాలను విడుదల చేసింది. ఇదే కోవలో ఏపీలో ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టేందుకు ముందుకు వచ్చింది.
ఈ కుల గణన చేపట్టే ముందు వివిధ కుల సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ఏపి ప్రభుత్వం భావిస్తుంది.
Leave a Reply