యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా అన్ని ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలను (Cardless cash withdrawal) అందుబాటులో ఉంచాలని ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతిపాదించింది. ఏటీఎంల (ATM) వద్ద కార్డులు లేకున్నా సులభంగా నగదు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాలను నివారించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.
కార్డు రహిత నగదు విత్‌డ్రా అంటే..?
వినియోగదారుడు..అతడు/ఆమె డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించకుండానే ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకోగలగడం. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే కార్డు రహిత నగదు విత్‌డ్రా సేవలను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వంటి కొన్ని బ్యాంకులు ఓటీపీ ద్వారా కార్డు లేకుండా కొద్ది మొత్తంలో నగదు విత్‌డ్రా సేవలను అందిస్తున్నాయి. అయితే, యూపీఐ ద్వారా అన్ని బ్యాంకులూ తమ ఏటీఎంల వద్ద ఈ సేవలను అందించాలని ఆర్‌బీఐ భావిస్తోంది.
ఎలా పని చేస్తుంది?
యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా సేవలను రెండు విధానాల్లో అందించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.
ఆప్షన్ – 1: వినియోగదారుడు ఏటీఎం టర్మినల్ వద్ద అవసరమైన వివరాలను అందిస్తే, ఏటీఎం క్యూఆర్ కోడ్‌ను అందిస్తుంది. వినియోగదారుడు తమ ఫోన్‌లోని యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అభ్యర్థనను ఆమోదించాల్సి ఉంటుంది. అటు తర్వాత ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఆప్షన్ – 2: టచ్‌స్క్రీన్ ఏటీఎంల వద్ద వినియోగదారులు తమ యూపీఐ ఐడీ ఎంటర్ చేసి విత్‌డ్రా చేసుకోవడం మరో పద్ధతి. ఏటీఎం వద్ద యూపీఐ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత వినియోగదారుడి మొబైల్ ఫోన్‌లోని యూపీఐ యాప్ ద్వారా అభ్యర్థనను అందుకుంటారు. ఇప్పటికే ఉన్న యూపీఐ యాప్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లావాదేవీని ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
కార్డు రహిత సేవలను అందించేందుకు బ్యాంకులకు కొంత సమయం పడుతుంది. ఏటీఎం సాఫ్టవేర్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు ఇతర పేమెంట్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, బ్యాంకులపై కొంత భారం కూడా పడొచ్చు. దీంతో బ్యాంకులు కొంత అదనపు ఫీజులతో ఈ సేవలను అందించే అవకాశముందని అంటున్నారు నిపుణులు.
Leave a Reply