Family Doctor Concept : ఫామిలీ డాక్టర్ లో కాన్సర్ స్క్రీనింగ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు.

విజయవాడలోని డీఎంహెచ్ కార్యాలయంలో ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త, క్యాన్సర్ ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమన్వయ సమావేశం సోమవారం జరిగింది.

డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో మెరుగైన చికిత్స అందించేలా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని తెలిపారు.

ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందించే వైద్యులు, సిబ్బందికి క్యాన్సర్ లక్షణాలు గుర్తించడంపై అవగాహన కలిగించడం, ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులకు పంపించడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఫామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఏమిటి?

ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం (Family Doctor Programme) అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి’ 2023 ఏప్రిల్ 6న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు.

అందరికీ మంచి ఆధునిక వైద్యం, అదీ ఉచితంగా .. అందరికీ తాము ఉంటున్న గ్రామంలోనే అందించే కార్యక్రమమే ‘ఫామిలీ డాక్టర్ ప్రోగ్రాం’..

మంచానికే పరిమితమైన రోగులకు సైతం వారి ఊర్లోనే, వారి ఇంటి దగ్గరే అవసరమైన వైద్యం అందజేయాలన్న ఉద్దేశ్యంతో ఫ్యామిలీ డాక్టర్ విధానానికి (family doctor scheme) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం .. పథకానికి సంబంధించి ప్రతి మండలంలో కనీసం రెండు పి.హెచ్.సి. (PHC = Primary Health Center) లు ఉంటాయి. ప్రతి పి.హెచ్.సి. కి ఇద్దరు డాక్టర్లను కేటాయిస్తారు. 104 వాహనంతో అనుసంధానమై ఒక డాక్టర్ పి.హెచ్.సి. లో ఉంటే మరొక డాక్టర్ ప్రతి రోజు తనకు కేటాయించిన గ్రామాల్లోని ‘డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్’ (YSR Village Clinic), పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తారు.

వైద్యుడు తనకు కేటాయించిన గ్రామాన్ని నెలలో కనీసం రెండు సార్లు సందర్శించి వైద్యసేవలు అందిస్తారు. ఒకే వైద్యుడు పలుమార్లు అదే గ్రామంలో ఉన్న అదే పేషెంట్ (patient) ను సందర్శించడం వలన ఆ పేషెంట్ కు డాక్టర్ కు మధ్య బాండింగ్ (bonding) ఏర్పడుతుంది. ఆ డాక్టర్ కు ఆ పేషెంట్ హెల్త్ ప్రొఫైల్ మీద పూర్తి అవగాహన ఉండటంతో మెరుగైన చికిత్స అందించడానికి సులభమవుతుంది. వైద్యునికి ఆ గ్రామంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తినీ పేరు పేరునా గుర్తించే అవకాశం ఉంటుంది.

ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం .. కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 936 మొబైల్ మెడికల్ యూనిట్ లను (104 సేవలు) అందుబాటులోకి తెచ్చింది.

నాడు-నేడు లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,032 డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లతో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ను అనుసంధానించడం వలన ఫ్యామిలీ డాక్టర్ .. డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లోని సి.హెచ్.ఓ (CHO = Community Health Officer), ఏ.ఎన్.ఎం (ANM = Auxiliary Nurse Midwife), ఆశా వర్కర్ల (ASHA = Accredited Social Health Activist) సహకారంతో వైద్య సేవలను అందిస్తారు.

ప్రతి డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో 14 రకాల టెస్టులు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. మరింత మెరుగైన వైద్యసేవలు అవసరం అయిన పేషెంట్లను డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన తర్వాత కూడా రోగులను ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షిస్తారు.

ఫ్యామిలీ డాక్టర్ అందించే వైద్య సేవలు

ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం .. ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ఈక్రింది వైద్య సేవలను అందిస్తారు.

  • సాధారణ వైద్య సేవలు
  • ప్రసూతి ఆరోగ్య సంరక్షణ సేవలు
  • బాలింతల ఆరోగ్య సంరక్షణ సేవలు
  • రక్తహీనత పరీక్షలు మరియు చికిత్స
  • అసంక్రమిత వ్యాధులకు ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్స
  • పాఠశాలలో వైద్య కార్యక్రమం
  • అంగన్వాడీ కేంద్ర సందర్శనం
  • మంచాన ఉన్న రోగుల గృహ సందర్శన

ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా అందే ఇతర వైద్య సేవలు

ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం .. ద్వారా ఈక్రింది వైద్య సేవలను కూడా అందించడం జరుగుతుంది.

  • దీర్ఘకాలిక వ్యాధుల సర్వే ద్వారా గుర్తించబడిన ‘బి.పి, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్’ .. లాంటి అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు చికిత్స, రెగ్యులర్ ఫాలో అప్ మరియు నివారణ ఆరోగ్య సేవలను అందజేయడం ద్వారా వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా పర్యవేక్షించడం .. అవుట్ ఆఫ్ పాకెట్ ఖర్చు తగ్గించడం.
  • e-సంజీవనీ, వీడియో టెలీ మెడిసిన్ సేవల ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం.
  • ఫ్యామిలీ డాక్టర్ అంగన్వాడీ కేంద్రాల సందర్శన ద్వారా పౌష్ఠికాహార లోపం ఉన్న చిన్నారులు మరియు రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలను, బాలింతలను గుర్తించి వారికి చికిత్స అందించడం.
  • పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ, శానిటేషన్, ఆరోగ్యం మీద అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం.

ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారి వివరాలు

  • పి.హెచ్.సి. లు : 1,293.
  • డాక్టర్లు : 2,875.
  • డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లు : 10,032.
  • సి.హెచ్.ఓ. లు : 10,032.
  • ఏ.ఎన్.ఎం. లు : 10,032.
  • ఆశా వర్కర్లు : 37,017.
  • 108, 104 వాహనాలు : 1,807.
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page