అర్5 జోన్ లోని ఇళ్ళ నిర్మాణంపై హైకోర్టు స్టే

అర్5 జోన్ లోని ఇళ్ళ నిర్మాణంపై హైకోర్టు స్టే

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఏర్పాటుచేసిన ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 

ఈ పిటిషన్లపై ఇరువైపుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడించేందుకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పును రిజర్వ్‌ చేయగా.. ఇవాళ తీర్పును వెల్లడించింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాజధాని అమరావతిలో ఆర్‌ 5 జోన్‌కి సంబంధించి సీఆర్డీఏ చట్టాన్ని సవరించి యాక్ట్‌ 13/2022, జీవో 45ని తీసుకొచ్చారు. మొత్తం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

అమరావతి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో పేదల కోసం మొత్తం 25 లే అవుట్‌లలో 50,793 మందికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే గత నెల 24న నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేశారు. ఇంతలో హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులకు బ్రేకులు పడ్డాయి. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది.

Click here to Share

You cannot copy content of this page