ఇళ్లు లేని పేదలకు పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాల్లో రెండు సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల్లో లబ్ధిదారులు, ఇంటి స్థలాల గుర్తింపు ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతోంది. తొలి విడత కింద ఎంపికైన అర్హులకు వీలైనంత తొందరగా ఇంటి పట్టాలను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తంగా రూపొందించి లబ్ధిదారులకు కేటాయించకుండా వదిలిన లేఅవుట్లలను గుర్తించి కొత్త లబ్ధిదారులకు సర్దుబాటు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 6.53 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. రెండు సంవత్సరాల్లోగా ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేసి, నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో స్థలాలు పొందిన వారు వెనక్కు ఇచ్చినట్లయితే.. అటువంటి వారికి సదరు లేఅవుట్లలోని ఖాళీ స్థలాల్లో సర్దుబాటు చేయనున్నారు.కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా 14 వేల దరఖాస్తులు ఇళ్ల పట్టాల కోసం గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు 1.17 లక్షల దరఖాస్తులు అందాయి. వాటి పరిశీలన సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
17 వేల దరఖాస్తులను పరిశీలించగా.. అందులో కేవలం వెయ్యి వరకు మాత్రమే అర్హత సాధించగా, ఐదువేల దరఖాస్తులు తిరస్కరణను గురయ్యాయి.కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 11 నుంచి 14 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
కర్నూలు, కాకినాడ, విజయనగరం, ప్రకాశం,ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, కోనసీమజిల్లాల్లో 5 వేల చొప్పున దరఖాస్తులు అందాయి.కడప, తిరుపతి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారీగా పరిశీలిస్తే వచ్చిన దరఖాస్తులు రెండు వేలలోపే ఉన్నాయి. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 332 దరఖాస్తులు అందాయి.
గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీ గందరగోళంగా జరిగింది. అప్పుడు ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 41 వేల మందిని కూటమి ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ సంఖ్య 50వేలు దాటబోతోంది. ఇంకా 1.87 లక్షల లబ్ధిదారుల వివరాలు పరిశీలించాల్సి ఉంది.
ఆ రాష్ట్రంలోని 10,410 గ్రామాల్లో మొత్తం 37,295 లేఅవుట్లు వేశారు. వీటిల్లో 24,88,669 ప్లాట్లను సిద్ధం చేశారు. అందులో 16,507 లేఅవుట్లలో మాత్రమే 100 శాతం ప్లాట్లను, 7 వేల లేఅవుట్లలో 5 శాతం ప్లాట్లనే లబ్ధిదారులకు కేటాయించినట్లు కాగితాలపై ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,972, కోనసీమ- 344, అనకాపల్లి- 283,ఏలూరు- 179, నెల్లూరు- 172, ప్రకాశం- 112, శ్రీసత్యసాయి – 172, కడప- 117 అన్నమయ్య-113,అనంతపురం జిల్లాలోని 101 లేఅవుట్లలో 5%ప్లాట్లనే లబ్ధిదారులకు కేటాయించారు.
Leave a Reply