ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లల కోసం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేయనున్నారు. ఇకపై వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్‌తో పాటుగా అదే రోజు ఉదయం ఉడికించిన శనగలు ఇస్తారు. అలాగే మెనూలో అన్ని కూరలు, మునగ పొడిని పప్పుతో పాటూ అందిస్తారు. బాలామృతంలో ఉండే చక్కెర స్థాయిని తగ్గించాలని నిర్ణయించారు.
అంగన్‌వాడీ మెనూలో చేసిన ఈ మార్పులను ముందుగా విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్లలోని ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటారు.. ఈ మెనూను నెల రోజుల పాటు అమలు చేశారు. ఆ తర్వాత ఈ మెనూ మార్పుపై తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుని.. వాటి ఆధారంగా మార్పులు చేశారు. మరో పది రోజుల్లో 26 జిల్లాల్లోని ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ మెనూపై తల్లిదండ్రులు, పిల్లల అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.

బాలామృతంలో పోషకాలు పెంచడానికి చేయాల్సిన మార్పులపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ‘ఈ కమిటీలో యునిసెఫ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, టాటా ట్రస్ట్, మంగళగిరి ఎయిమ్స్ ప్రతినిధులు’ ఉన్నారు. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వారితో చాలాసార్లు చర్చించారు.. వారి సూచనలు, సలహాల ప్రకారం బాలామృతంలో చక్కెర స్థాయిని తగ్గించి, పెసరపప్పు, గోధుమపిండి, వేయించిన వేరుశనగ పొడి, శనగ పొడిని కలిపి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. చక్కెర లేకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు వేర్వేరు అభిప్రాయాలు చెప్పారు. కొంతమంది తల్లిదండ్రులు చక్కెర లేదా బెల్లం కలపాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో తల్లిదండ్రులు బాలామృతంలో వేరుశనగ కలపడం వల్ల వాసన వస్తోందని, జీలకర్ర కలిపితే అది తగ్గుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంతకుముందు 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలామృతం ఇచ్చేవారు. ఇకపై దానిని రెండు విభాగాలుగా చేస్తారు. ‘7 నుంచి 12 నెలల పిల్లలను జూనియర్‌గా, 13 నుంచి 3 సంవత్సరాల పిల్లలను సీనియర్‌గా’ పరిగణిస్తారు. ఈ మేరకు పోషకాలతో బాలామృతంలో మార్పులు చేస్తారు. ఈ బాధ్యత మొత్తాన్ని అక్షయపాత్రకు అప్పగించారు.
Leave a Reply