AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు మంచి సమాచారం లభించనుంది. ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025 నిబంధనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ విభజన, బార్ లైసెన్స్‌ రూల్స్ మార్పులు, కొత్త పోర్టుల ఏర్పాటుకు అనుమతి లభించాయి.

డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు

కేబినెట్ భేటీలో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి (డీమెర్జ్‌ చేసి) స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌) రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. వ్యవసాయం, భద్రత, పరిశ్రమల కోసం డ్రోన్‌ల వినియోగం పెరిగేలా ఈ కొత్త సంస్థ పని చేయనుంది.

పోర్టుల అభివృద్ధి, హోటల్ రంగానికి ఊరట

కేబినెట్ సమావేశంలో అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల రాష్ట్రంలో లాజిస్టిక్స్‌ సదుపాయాలు మెరుగవుతాయని, వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. హోటల్ పరిశ్రమకు ప్రోత్సాహంగా బార్ లైసెన్స్‌ ఫీజును రూ.25 లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

ప్రధాని మోదీ అమరావతి పర్యటన

కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనపై కూడా చర్చ జరిగింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటన కోసం ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ధి పనులకు ఇదొక మలుపుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆమోదం పొందిన అంశాలు : 

  • అనకాపల్లి జిల్లాలోని డీఎల్‌పురం వద్ద క్యాపిటివ్‌ పోర్టు (Captive port) ఏర్పాటుకు ఆమోదం.
  • త్రీ స్టార్‌, ఆ పైబడిన హోటళ్లకు బార్‌ లైసెన్స్‌ ఫీజుల కుదింపునకు ఆమోదం. బార్‌ లైసెన్స్‌ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ ఆమోదం.
  • యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు ఆమోదం.
  • రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం.
  • ఏపీ మీడియా అక్రిడిటేషన్‌ నిబంధనలు -2025కి ఆమోదం.
  • నాగార్జునసాగర్‌ (Nagarjunasagar) లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం.
  • జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్‌ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన.
Click here to Share

You cannot copy content of this page