ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన జులై 24న ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. వీటిని మనం వెంటబడి మరీ గ్రౌండ్ చేయించాలని సూచించారు. ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు.
త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని.. ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా మనం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో కూడా అందరి కంటే ముందు ఉండాలని.. దీనివల్ల మనకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సింగపూర్‌తో సంబంధాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మన చూపించిన చొరవతో సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేసిందని గుర్తు చేశారు. సింగపూర్ ప్రభుత్వం కూడా అలానే సహాయం చేసిందని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.
గతంలో అమరావతి రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియం ముందుకు వచ్చిందని.. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ కంపెనీ నిర్వాహకులను అప్పటి సీఎం జగన్ వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కంపెనీ నిర్వాహకులపై జగన్ ప్రభుత్వం అవినీతి ముద్ర వేసిందని ధ్వజమెత్తారు. సింగపూర్ కన్సార్టియం నిర్వాహకులపై కేసు పెట్టేందుకు కూడా ప్రయత్నం చేశారని.. దీంతో వాళ్లు ఏపీపై పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. సింగపూర్‌తో సంబంధాలు అన్నింటిని కూడా జగన్ చెడగొట్టారని.. అందుకనే వాళ్లతో మళ్లీ మన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. సింగపూర్ కన్సార్టియం నిర్వాహకులు సీడ్ క్యాపిటల్ మినహా ఏ ప్రాజెక్ట్ అయినా చేపడతామని అంటున్నారని సీఎం గుర్తుచేశారు.
2024 నుంచి 2025 సంవత్సరానికి నీటి పన్నుపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుపతి తొక్కిసలాటపై జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఇచ్చిన కమిషన్ నివేదికపై చర్చించారు. ఇరువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి ఆదేశాలు జారీ చేసింది. గో సంరక్షణ అధికారి, మరో డీఎస్పీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
కాగా, అప్పటి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుకి క్లీన్ చిట్ ఇచ్చింది ఏకసభ్య కమిషన్. తిరుపతిలో భవనాల క్రమబద్ధీకరణ విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అలాగే తిరుపతిలో స్పష్టమైన చట్టం తేవాలని కేబినెట్ భావించింది. ఈ సారి క్రమబద్ధీకరణ చేసిన తర్వాత చట్టం తీసుకువచ్చి భవిష్యత్‌లో ఏలాంటి అక్రమ నిర్మాణాలు చేయకుండా చూడాలని నిర్ణయించింది కేబినెట్. ఇలా ఎన్ని రోజులు క్రమబద్ధీకరణ చేసుకుంటూ వెళ్తామని కేబినెట్‌లో వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అందువల్లే మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Leave a Reply