AP Revenue Sadassulu :రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారన్నారు. వైసీపీ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రెవెన్యూ సదస్సుల్లో గ్రామస్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు అధికారులు పాల్గొని సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో పాల్గొ్న్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
రెవెన్యూ ఉద్యోగుల సమావేశం
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు నిర్వహించామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల రెవెన్యూ సంఘాల సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించామన్నారు. 12వ పీఆర్సీ, ఐఆర్ పై గతంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని , వాటిని అమలు చేసేలా ఉద్యోగులపై ఒత్తిడి చేశారని బొప్పరాజు అన్నారు. గతంలో ప్రతి రోజూ టార్గెట్ పెట్టి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారన్నారు. ఫ్రీ హోల్డ్ ప్రక్రియలో తప్పులున్నాయని ప్రస్తుత ప్రభుత్వం అభిప్రాయపడుతుందని, ఇందులో ఉద్యోగులపై నిందలు మోపడం సరికాదన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తారన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన ఉద్యోగులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వచ్చే నెలలో జరిగే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామని బొప్పరాజు అన్నారు. రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేయడానికి ఈ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. భూసమస్యలకు పరిష్కారం చూపాలని ఉద్యోగులకు సూచించారు. ప్రతి ఉద్యోగి భాగస్వామ్యమై రెవెన్యూ శాఖను పటిష్ఠం చేయాలన్నారు. రాష్ట్రంలో అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, రికార్డుల భద్రతను ప్రత్యేకంగా రికార్డు అసిస్టెంట్ కు కేటాయించాలన్నారు. రికార్డు అసిస్టెంట్ పోస్టు ఏర్పాటుపై పదేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ ఆఫీసులకు కనీసం వాచ్ మెన్ కూడా లేరన్నారు.
రెవెన్యూ శాఖలో వందలాదిగా రికార్డులు ఉంటాయని, కానీ కార్యాలయాలకు సరైన భద్రత లేదని బొప్పరాజు ప్రశ్నించారు. సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశాలు అందాయని, కానీ నిధులు విడుదల కాలేదన్నారు. మదనపల్లె ఫైళ్ల దహనం కేసుపై విచారణ పూర్తి అయ్యాక వాస్తవాలు బయటపెట్టాలన్నారు.