జనవరి నుంచి జన్మభూమి 2.0

జనవరి నుంచి జన్మభూమి 2.0

రాష్ట్రవ్యాప్తంగా 2025 జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ముందుకు వచ్చేవారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. రాబోయే ఐదేళ్ళలో 17,500 కిలో మీటర్లు మేర సిమెంట్‌ రోడ్లు నిర్మిస్తామన్నారు. సచివాలయంలో పంచాయతీరాజ్‌, గామీణాభివృద్ది, పర్యావరణం, అటవీశాఖలపై డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిమెంట్‌ రోడ్లతో పాటు 10వేల సిసి కిలో మీటర్ల డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్దిక సంఘం నిధులు రూ.990కోట్లు, జల్‌జీవన్‌మిషన్‌ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.500కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులను దారి మళ్లించిందని చెప్పారు. ఫలితంగా కనీస స్దాయిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖలను బలోపేతం చేస్తామన్నారు. 14-19 మధ్య కాలంలో చేపట్టిన పలు కార్యక్రమాలు గ్రామాల రూపురేఖలు మార్చితే, గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చిందని చెప్పారు.

గ్రామాల్లో ఇళ్లకు అవసరమైన విద్యుత్తు, గ్యాస్‌, టాయిలెట్‌, నీటికుళాయి వంటి వాటిని అందించేందుకు ప్రణాళికా బద్దంగా పనిచేయాలన్నారు. గ్రామాల నుండి సమీపప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెట్‌ ప్లేస్‌లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎల్‌ఇడి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా చేపట్టకుండా వదిలేసిందన్నారు. దీంతో గ్రామాల్లో 60 శాతం లైట్లు మాత్రమే వెలుగుతున్నట్లు అధికారులు తెలిపారన్నారు. ఇందుకు సంబంధించి రూ.482 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు.

రాష్ట్రంలోని అన్ని పంచాయతీల భవనాల ద్వారా సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయాలని సిఎం సూచించారు. గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులను చర్చించేందుకు ఆయా గ్రామాల్లో ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. హార్టికల్చర్‌తో కలుపుకుని రాష్ట్రంలో 50 శాతం గ్రీన్‌ బెల్ట్‌ సాధించాలని సిఎంపేర్కొన్నారు. నగర వనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాల్లోనిపట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు చేపట్టాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలన్నారు.

డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ గ్రామాల ముఖచిత్రం మార్చడంలో కీలకమైన పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ది శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. నేడు మళ్లీ నిధులు కేటాయించడం, కొత్త విధానాల ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు వివరించారు. ఈ సమీక్షలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page