రాష్ట్రంలో ఇసుక బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ అప్లికేషన్ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గనుల శాఖ కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక సరఫరాపై బుధవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మార్గదర్యకాలు జారీ చేశారని వెల్లడించారు.
ఇసుక బుకింగ్ మార్గదర్శకాలివీ
అన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు వినియోగదారులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి ఇసుక బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- బుకింగ్ సమయంలోనే ఏ రోజున ఇసుక డెలివరీ అవుతుందనే సమాచారం వినియోగదారుడికి తెలియజేస్తారు.
- ఆన్‌లైన్ విధానంలో బల్క్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
- బల్క్ బుకింగ్ చేసుకునే వారు జీఎస్టీ, నిర్మాణ పనులు, ప్రాజెక్ట్‌ల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వ ప్రతినిధులు భౌతికంగా పని ప్రదేశాలను సందర్శించి పరిశీలిస్తారు.
- ఇసుక వినియోగంపై క్రమానుగుణంగా థర్డ్‌పార్టీ ఏజెన్సీ ద్వారా ఆడిట్ నిర్వహిస్తారు.
- ఇసుక సరఫరా కోసం వెహికల్ ఎంపానెల్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెడతారు. రిజిస్టర్డ్ వాహనాలను లేదా వినియోగదారు సొంత వాహనాల
ద్వారా ఇసుక సరఫరా కోసం ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. - దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా రీచ్/స్టాక్ పాయింట్ సామర్థ్యం ఆధారంగా రోజువారీ సరఫరాపై షరతులు విధిస్తారు.
- మొదట బుక్ చేసుకున్న వారికే ఇసుక సరఫరా అయ్యేలా చూడటంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంచుతారు.
- వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్, జిల్లా విజిలెన్స్ కమిటీలను బలోపేతం చేయడం సహా పలు చర్యలు చేపడతారు.
- ఇసుక సమస్యలపై 1800-599-45999, dmgapsandcomplaints@yahoo.com కు ఫిర్యాదులు చేయవచ్చు.
- ఇసుక సరఫరాను రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేయడం, వినియోగదారులు, రవాణాదారుల, ఇతర వాటాదారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో సులభతర కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- ఇసుక తవ్వకం, రవాణా కార్యకలాపాలన్నిటినీ పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో కమాండ్, కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. కమాండ్, కంట్రోల్ సెంటర్ వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికి కృషి చేస్తుంది.
- అ ఇసుక విధానంపై ప్రజల సంతృప్తిని కాలానుగుణ ఫీడ్‌బ్యాక్ ద్వారా అంచనా వేస్తారు.
- వినియోగదారులకు ఇసుక బుకింగ్ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు, అక్రమ రవాణా కట్టడి, ఇతర అంశాల్లో కృత్రిమ మేధస్సు ఉపయోగిస్తారు. బుకింగ్ సౌలభ్యం, సమర్థవంతమైన ఇసుక కార్యకలాపాలు, రవాణాను మెరుగుపరచడం కోసం వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించి, ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు.