ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పెంపుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 3000 రూపాయల నుండి 4000 రూపాయలకు పెన్షన్ అమౌంట్ ను పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సంతకం చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం (NTR Bharosa Scheme) పేరుతో అమలు చేయనున్న ప్రభుత్వం.
గత ప్రభుత్వం పింఛన్‌దారులందరికీ 3000 పింఛన్ ఇచ్చేది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు పింఛను మొత్తాన్ని 4000 రూపాయలకు పెంచుతూ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే నిర్ణయం తీసుకుంది.
మరోవైపు వికలాంగుల పెన్షన్ అమౌంట్ ను 6000 రూపాయలకు పెంచడం జరిగింది. గతంలో 3 వేలు పొందుతున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర పింఛన్ లబ్ధిదారులు వచ్చే నెల నుంచి 4 వేల రూపాయలు అందుకోనున్నారు.
- వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర సామాజిక పెన్షన్లు – 4000 కు పెంపు
- దివ్యాంగులకు – 6000 కు పెంపు
- పూర్తిగా అంగలవైకల్యం చెందిన వారికి – ప్రస్తుతం ఇస్తున్న 5000 నుంచి 15 వేలకు పెంపు.
- క్రానిక్ జబ్బులు ఉన్నవారికి – 10 వేలకు పెంపు
జూలైలో 7000 పెన్షన్ అందుకోనున్న లబ్ధిదారులు
ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. తాము ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా సవరించిన పెన్షన్ ఏప్రిల్ 2024 నుండి వర్తిస్తుంది. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతినెలా 1000 రూపాయల చొప్పున పెండింగ్ 3000 మొత్తాన్ని కలిపి జూలై 2024 నెలలో పెన్షన్ లబ్ధిదారులకు 7000 రూపాయలను చెల్లించాలని నిర్ణయించింది.
పెన్షన్ పెంపు ఫైల్ పై సంతకం పెట్టే సమయంలో. చంద్రబాబు నాయుడు పెన్షన్ లబ్ధిదారుల తో మాట్లాడటం జరిగింది. పెన్షన్ పెంపు నిర్ణయం పై వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులు ఆయన కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ పెంపుతో పాటు మరో ఐదు ఫైల్స్ పైన ముఖ్యమంత్రి సంతకాలు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.
మరి పెన్షన్ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా లేదా ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన విధంగా పాక్షికంగా బ్యాంకు ఖాతాలో, పాక్షికంగా సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తారా అనే దానిపైన త్వరలో పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, అతి త్వరలో వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా సమీక్ష జరపనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై శాఖల వారీగా శ్వేత పత్రాలు కూడా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.