ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు.. ఆ ఐదు హామీలపై సంతకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు.. ఆ ఐదు హామీలపై సంతకం

వెలగపూడి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. (కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52) ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

మరోవైపు సీఎం చంద్రబాబు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో శాఖలవారీగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏంటి.. పనుల పురోగతి.. ఆయా శాఖల్లో పరిస్థితుపై సమీక్ష చేయనున్నారు. అలాగే అన్ని శాఖలపై శ్వేతపత్రాలు సిద్ధం చేసి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ శ్వేతపత్రాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచి.. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలకు వివరిద్దామన్నారు. కచ్చితంగా వ్యవస్థల ప్రక్షాళన జరగాలని చంద్రబాబు బుధవారం జరిగిన భేటీలో చెప్పారట.

రాష్ట్ర పునర్ నిర్మాణంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. సంతృప్తే కొలబద్దగా పనిచేయాలన్నారు. మంత్రి పదవిని ఆషామాషీగా తీసుకోవద్దని.. కేటాయించిన శాఖల్లో ఫలితం చూపించేలా పనిచేయాలన్నారు. అందరూ కలిసి టీమ్ వర్క్‌గా ముందుకు సాగాలని.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో తనకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని సూచించారు. అందరం కలిసి ప్రజలకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుందామని చెప్పారట. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన సిబ్బందిని ఎవరినీ తీసుకోవద్దని మంత్రులకు సూచించారట. కొత్తవారిని తీసుకోవాలని.. మంత్రుల అభీష్టం, సమర్థతను బట్టి శాఖల కేటాయింపు ఉంటుందని వారితో చెప్పినట్లు తెలుస్తోంది.

You cannot copy content of this page