ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
ఇప్పటికే 97 శాతం ఈ-క్రాప్ నమోదు, 70 శాతం రైతుల ఈ-కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల 10వ తేదీ కల్లా ఈ-కేవైసీ పూర్తిచేయాలన్నారు.
అధికారులందరూ ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ-క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు.
సామాజిక తనిఖీ అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితా అక్టోబర్ రెండోవారంలో జమచేయనున్న పీఎం కిసాన్ 15వ విడత సాయం కోసం.. అర్హతగల రైతులందరూ ఆధార్తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ-కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15వ తేదీకల్లా వాటిని సరిచేసుకోవాలని కోరారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాలన్నారు.
ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలుదారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి కిసాన్ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్ల శిక్షణ కోసం జారీచేసి మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. పాస్పోర్ట్ ఉండాలనే నిబంధనను తొలగించామన్నారు. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గ్యాప్ పొలంబడులకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు.
Leave a Reply