వంట గ్యాస్ వినియోగదారులకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాఖీ పౌర్ణమి పండుగ కానుకగా దేశవ్యాప్తంగా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. గృహ వినియోగానికి ఉపయోగిస్తున్నటువంటి 14.2 కేజీల సిలిండర్ పై ఏకంగా 200 రూపాయలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 33 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
మరోవైపు ప్రధానమంత్రి ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో వంట గ్యాస్ సిలిండర్ ఏకంగా నాలుగు వందల రాయితీ తోటి లభించునుంది.
ఆగస్ట్ 30 నుంచి సిలిండర్ పై రాయితీ
కేంద్రం తగ్గించిన వంటగ్యాస్ పై రాయితీ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 30 నుంచి ప్రతి ఒక్కరికి ఈ రెండు వందల రూపాయల రాయితీ వర్తించనుంది.
ఎవరైతే ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్నారో వారికి ఏకంగా 400 రూపాయల రాయితీ లభిస్తుంది.
ప్రధాన మంత్రి ఉజ్జ్వల పథకం కింద దేశ వ్యాప్తంగా 9.59 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులకు సిలిండర్ పై ₹200 రూపాయల రాయితీ ని మార్చి నెలలో ప్రకటించగా, ప్రస్తుతం ఉజ్వల పథకం కింద లేని వారికి కూడా 200 రూపాయల రాయితీని వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది.
14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ల పై ఈ ₹200 రాయితీ వర్తిస్తుంది. వీరీతో పాటు PMUY ద్వారా సిలిండర్ పొందిన అందరికీ 14.2 కేజీల గృహ సిలిండర్ల పై ₹400 రాయితీ వర్తిస్తుంది.ఏడాది కి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
హైదరాబాద్ లో ధరలు ఈ విధంగా ఉండనున్నాయి
ప్రస్తుతం హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్ లో వంట గ్యాస్ సిలిండర్ ధర 1155 రూపాయల వరకు ఉండగా, తాజా నిర్ణయంతో 955 రూపాయలకే సిలిండర్ లభించనుంది. దేశ రాజధానిలో ప్రస్తుతం 1103 రూపాయలు వసూలు చేస్తుండగా ఇకపై సిలిండర్ 903 రూపాయలకే లభించనుంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు మరియు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెరుగుతున్న అధిక సిలిండర్ ధరల నుంచి ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
For More Updates Join us on Telegram
Leave a Reply