గ్రామాల్లోని సంప్రదాయ కుల వృత్తిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుడుతోంది.
సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ పథకంపై రాష్ట్రంలో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కేఎస్ జవహర్ రెడ్డి జిలాకలెక్టర్లను ఆదేశించారు.
తొలుత ఈ పథకంపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్లకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సూచించారు.
18 రకాల వృత్తి, హస్త కళాకారుల్లో లబ్ధిదారులను గుర్తించాల్సి ఉందని, లబ్ధిదారుల నమోదు ప్రక్రియపై వాలంటీర్లకు శిక్షనివ్వాలని సీఎస్ చెప్పారు. నైపుణ్య కేంద్రాలనూ గుర్తించాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు.
ఈ పథకం కింద తొలిదశలో ఒక లక్ష మంది లబ్ధిదారులతో ప్రారంభించనుందని, ఈలోగా రాష్ట్రంలో అర్హులైన 18ఏళ్లు నిండిన సంప్రదాయ కుల, చేతి వృత్తిదారులను, హస్త కళాకారులను గుర్తించాలన్నారు. లబ్ధిదారుల ఆన్లైన్ ఎన్రోల్మెంట్ అనంతరం వెరిఫికేషన్ చేయాలని, అర్హులకు పీఎం విశ్వకర్మ యోజన సర్టిఫికెట్తో పాటు గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆయన తెలిపారు.
గ్రామాల్లోని సంప్రదాయ కుల, హస్త కళాకారులకు నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడం, మార్కెట్ అనుసంధానం చేయడం, సామాజిక భద్రత అందించడం ఈ పథకం లక్ష్యమని సీఎస్ జవహర్రెడ్డి వివరించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 30 లక్షల మంది కళాకారులు వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు 2023-2028 వరకు కేంద్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లను వ్యయం చేయనుంది.
Leave a Reply