పేదలకు 54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉచితంగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం, మరో 9 వేల ఎకరాలకు గ్రీన్ సిగ్నల్

పేదలకు 54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉచితంగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం, మరో 9 వేల ఎకరాలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు ఉచితంగా భూమి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ నెల లోనే ఆమోదముద్ర పడనుంది.

54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ని పంపిణీ చేయనున్న ప్రభుత్వం

రోజువారీ కూలి నాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారికి, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తుంది. తద్వారా ‘ఈ భూమి మాదే’ అని పేదలు చెప్పుకునేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 54 వేల ఎకరాల భూ పంపిణీకి సన్నాహాలు చేస్తుంది.

ఎన్నో దశాబ్దాల క్రితం ఆనాటి కాంగ్రెస్ హయాంలో పేదలకు ఉచితంగా వ్యవసాయ భూములు పంపిణీ చేశారు. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు తిరిగి నిరుపేదలకు వ్యవసాయ భూములను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 23 జిల్లాల్లో 54 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అర్హులైన సుమారు 47 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆయా జిల్లాల అసైన్మెంట్ కమిటీల ఆమోదం కూడా దాదాపు పూర్తయింది.

ఒక్కొక్కరికి ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరాలు

భూమి లభ్యతను బట్టి ఒక్కో లబ్ధిదారునికి ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం వరకు వ్యవసాయ భూమి ఇస్తారు. గ్రామాల్లో నిరుపేదలకు వ్యవసాయ భూములు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏడాది కిందటే ఈ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అన్ని జిల్లాల్లో పేదలకు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న భూమి, అర్హులైన లబ్ధిదారుల వివరాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ల పరిశీలన తర్వాత 23 జిల్లాలలో ప్రస్తుతం ఈ పంపిణీ చేసే భూమి అందుబాటులో ఉన్నట్లు తేలింది.

వైఎస్సార్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆశాజనకంగా భూమి అందుబాటులో ఉండగా, మరో 8 జిల్లాల్లో వెయ్యి నుంచి 4 వేల ఎకరాల లోపు భూమి లభ్యత ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరో 9 జిల్లాల్లో వెయ్యి నుంచి 2 వేల ఎకరాల భూమి ఉండగా, 4 జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు భూమి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. విశాఖ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భూమి అందుబాటులో లేదు. దీంతో భూమి లభ్యత ఉన్న 23 జిల్లాల్లో గుర్తించిన భూమిని సర్వే చేసి, డిమార్కేషన్ చేయించారు. అసైన్మెంట్ కమిటీల అనుమతులు కూడా లభించాయి. త్వరలో మంత్రివర్గం భూ పంపిణీకి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో 7,476, కర్నూలు 4,092, నంద్యాల 3,678, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 3,711, కాకినాడ 2,935, చిత్తూరు 2,866, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,565 ఎకరాలను పంపిణీ చేయనున్నారు.

9 వేల లంక భూములకు కూడా పట్టాలు

కృష్ణ, గోదావరి నది తీరంలో ఉన్నటువంటి లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి సన్నాహాలు చేస్తుంది. 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా గోదావరి లంక ప్రాంతాల్లోని 9062 ఎకరాలకు సంబంధించి 19 వేల మందికి పైగా ఈ పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 54 వేల ఎకరాల పంపిణీ తో పాటే వీరికి కూడా డి పట్టాలను ఇవ్వనున్నారు.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram చానెల్ లో జాయిన్ అవ్వండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page