దేశవ్యాప్తంగా ₹2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బిఐ కీలక ప్రకటన జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నోట్లు సెప్టెంబర్ 30 వరకు సాధారణ నోట్ల వలె (లీగల్ టెండర్ గా) చలామణి అవుతాయని, సెప్టెంబర్ 30 నాటికి నోట్లు ఉన్నవారు మార్చుకోవడం లేదా డిపాజిట్ చేసుకోవడం చేయాలని పేర్కొంది.
ఈ మేరకు వినియోగదారులకు ₹2000 రూపాయలు నోట్ ఇవ్వవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అదేవిధంగా బ్యాంకుల్లో ₹2000 నోట్లు కలిగిన వారు తమ ఖాతాలో డిపాజిట్ చేసుకునే సౌలభ్యం లేదా ఇతర చెల్లుబాటు అయ్యే నోట్లకు మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించాలని బ్యాంకులకు సూచించింది.
2000 నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలని RBI పేర్కొంది. దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలలో 2000 నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఒక విడతలో 20వేల రూపాయల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరిగింది. లేదంటే తమ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే డిపాజిట్ పై పరిమితి లాంటి ఎటువంటి నిబంధనను విధించలేదు.
ఈ నిర్ణయం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లను 2000 రూపాయల నోట్లు ఉన్నట్లయితే వాటిని తమ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చని లేదంటే ఇతర చెల్లుబాటు అయ్యే నోట్లతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని పేర్కొంది. మే 23వ తేదీ తర్వాత మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.
2016లో నోట్ల రద్దు తర్వాత ఆర్బిఐ ఈ రెండు వేల రూపాయల నోట్లను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతమున్న వాటిలో 89 శాతం నోట్లు మార్చ్ 2017 మునుపే ప్రింట్ చేసినవి కావడం గమనార్హం. అదేవిధంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే 2000 నోట్ల ముద్రణ ఆపివేసినట్లు ఆర్బిఐ ప్రకటించింది. మార్చి 31 2023 నాటికి చలామణిలో ఉన్నటువంటి మొత్తం కరెన్సీ నోట్లలో ₹2000 రూపాయల నోట్ల వాటా 10.8% గా ఉన్నట్లు ఆర్బిఐ పేర్కొంది.
ఆర్పిఐ జారీ చేసిన ప్రకటన కాపీ ని మీరు కింద చెక్ చేయవచ్చు
Leave a Reply