ఆధార్‌ ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

,
ఆధార్‌ ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఆధార్‌ (Aadhaar) ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఇకపై ఆఫ్‌లైన్‌ వెరికేషన్‌ చేసే సంస్థలు (OVSE) కచ్చితంగా మెరుగైన భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించింది. దీనివల్ల ఆధార్‌ భద్రతపై ప్రజల్లో నమ్మకం పెరగడంతోపాటు, ప్రభుత్వపరమైన అంశాల్లో ఆధార్‌ను స్వచ్ఛందంగా సమర్పించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారని ఉడాయ్‌ భావిస్తోంది.

‘‘ఓవీఎస్‌ఈలు ఆఫ్‌లైన్‌లో ధ్రువీకరణ చేసే ముందు ఆధార్‌ పొందిన వ్యక్తి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాకుండా, ఆధార్ భద్రత, గోప్యత గురించి వారికి భరోసా ఇవ్వాలి. భవిష్యత్తులో UIDAI లేదా ఇతర ప్రభుత్వశాఖల పరిశీలన నిమిత్తం ప్రతి ధ్రువీకరణ వివరాలను సంబంధిత రికార్డులలో నమోదు చేయాలి’’ అని ఉడాయ్‌ సూచించింది. దీంతోపాటు ఆధార్‌ను భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ధ్రువీకరణ పత్రంగా అనుమతించే ముందు నాలుగు విధాలుగా (ఆధార్‌ ప్రింట్, ఈ-ఆధార్‌, ఎమ్‌-ఆధార్‌, ఆధార్‌ పీవీసీ) జారీ చేసిన ఆధార్‌లపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ధ్రువీకరణ జరపాలని ఆదేశించింది.

‘‘ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ సమయంలో ఓవీఎస్‌ఈలు ఆధార్‌ను వెరిఫై చేయలేకపోతే.. సదరు వ్యక్తికి సేవలు నిరాకరించకుండా, ప్రభుత్వం జారీ చేసిన మరో గుర్తింపు పత్రం సమర్పించి తన గుర్తింపును నిరూపించుకునేలా పోత్రహించాలి. ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో వెరిఫై చేసే సంస్థలు ధ్రువీకరణ పూర్తయిన తర్వాత తమ వద్ద వినియోగదారులకు సంబంధించి ఎలాంటి వివరాలు భద్రపరచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో భౌతికంగా ఉంచుకోవాల్సి వస్తే మాస్క్‌డ్‌ ఆధార్‌ను మాత్రమే అనుమతించాలి’’ అని ఉడాయ్‌ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.

‘‘ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌లో భాగంగా ఆధార్‌లోని వివరాలు సరైనవికావని గుర్తిస్తే, 72 గంటల్లోగా ఉడాయ్‌కు సమాచారం అందిచాలి. ఓవీఎస్‌ఈలు ప్రభుత్వ వ్యవస్థల కోసం కాకుండా బయటి వ్యక్తులు, సంస్థల కోసం ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ చేయకూడదు’’ అని సూచించింది. ఆధార్‌ను దుర్వినియోగం చేయడం, అనుమతి లేకుండా ఆధార్‌లో మార్పులు చేయడం వంటివి ఆధార్‌ చట్టం సెక్షన్‌ 35 ప్రకారం శిక్షార్హమైన నేరమని ఉడాయ్‌ ఓవీఎస్‌ఈలకు తెలిపింది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page