ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
కేబినెట్ సమావేశంలో ఆమోదించిన అంశాలివే..
- ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్లు రుణం తీసుకోవడంపై ఆమోదం
- ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు ఆమోదం
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం
- గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆర్‌టీజీఎస్ ఏర్పాటుకు ఆమోదం
- తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదం
- కడప జిల్లా సీకేదిన్నెలో 2,595 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు ఆమోదం
- అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు ఆమోదం
- ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం. విద్యుత్ సుంకంలో టారిఫ్‌ల తగ్గింపును మార్చి వరకు పొడిగిస్తూ ఆమోదం
- 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదం
పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: సీఎం
వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రారంభంలోనే పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం పలు రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం, రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు.
Leave a Reply