ఏపీలో పెన్షన్‌దారులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్.. కొత్త మార్గదర్శకాలు

ఏపీలో పెన్షన్‌దారులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్.. కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి నుంచి పెన్షన్ల పంపిణీలో ఈ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పెన్షన్ అందుకునేవారికి ఒక శుభవార్తను, ఒక చేదు వార్తను చెప్పింది. గుడ్‌న్యూస్ ఏంటంటే ఇక నుంచి వరుసగా 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా.. 3వ నెలలో ముందు రెండు నెలలు కలుపుకుని మొత్తం 3 నెలల పెన్షన్ అందించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక బ్యాడ్‌న్యూస్ ఏంటంటే వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్లను రద్దు చేయనుంది. అయితే అలాంటి వారి కోసం మరో నిర్ణయం కూడా తీసుకుంది.

ఇప్పటివరకు ఒక నెలలో ఎవరైనా అందుబాటులో లేక పెన్షన్ తీసుకోకపోతే.. ఇక దాన్ని మళ్లీ ఇచ్చేవారు కాదు. కానీ తాజాగా ఆ నిబంధనలను మార్చేసిన చంద్రబాబు సర్కార్.. రెండు నెలల పాటు తీసుకోకున్నా.. ఆ మొత్తాన్ని మూడో నెలతో కలిపి ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీని సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల నుంచే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఒకవేళ.. ఎవరైనా పెన్షన్‌దారులు 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించనున్నారు. అప్పటి నుంచి వారికి పెన్షన్ నిలిపేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. వారు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్లీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు. ఇక ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణిస్తే.. చనిపోయిన వ్యక్తి భార్యకు ఆ తర్వాతి నెల నుంచే వితంతు పెన్షన్‌ను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొన్నారు. దీనికోసం జిల్లాస్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు.. క్షేత్రస్థాయిలో సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు మంత్రి తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లు లబ్ధిదారులకు అందిస్తోంది. అంతేకాకుండా ప్రతీ నెల 3వ తేదీ లోపే అందరికీ పెన్షన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తోంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page