ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీకి పాటించవలసిన నిబంధనలకు సంబంధించిన సిబ్బందికి ఏపీఎస్ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాలకు ఈడి అప్పలరాజు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు బస్సుల ప్రయాణానికి టికెట్ ధరలో 25% రాయితీని ఆర్టీసీ అప్పటి నుంచో కల్పిస్తున్న విషయం తెలిసిందే.
టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బందికి వృద్ధులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే సిబ్బంది టికెట్లు జారీ చేస్తున్నారని మరియు ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను అంగీకరించడం లేదని పలు ప్రాంతాలలో వృద్ధులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఒరిజినల్ కార్డు లేకపోతే డిజిటల్ కార్డులు చూపించిన సరిపోతుందని ఉత్తర్వులలో పేర్కొంది. ఆర్టీసీ సిబ్బంది అవగాహన లేమితో టికెట్లు జారీకి నిరాకరిస్తున్నారని ఇకపై అటువంటి సంఘటనలు జరగకూడదని జిల్లా ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసింది
ఇందుకు సంబంధించి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇకపై వృద్ధులు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడి కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్ట్ రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించిన టికట్టులో రాయితీ పొందవచ్చు అని ఆదేశాలలో పేర్కొంది.
ఒకవేళ ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే డిజిటల్ కార్డులు చూపించిన రాయితీ టికెట్టు పొందవచ్చు అని ఉత్తర్వులలో తెలిపింది. మరియు ప్రాంతం రాష్ట్రం తో సంబంధం లేకుండా అందరికీ అన్ని బస్సుల్లో వృద్ధులకు రాయితీ టికెట్లు ఇవ్వాలని సిబ్బందికి యాజమాన్యం స్పష్టం చేసింది.
Leave a Reply