నేటి నుంచి చెత్త పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

నేటి నుంచి చెత్త పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో.. రాష్ట్రంలో ఎక్కడా చెత్తపన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిందని.. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై 85 లక్షల టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన మొత్తం చెత్తను ఏడాదిలోపు శుభ్రం చేయించాలని పురపాలక మంత్రి నారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశే ధ్యేయంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి ఈ లక్ష్యానికి చేరుకోవాలని.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పరిశుభ్ర వాతావరణం కనిపించాలని.. రాబోయే రోజుల్లో రోడ్లపై చెత్త ఉండకూడదన్నారు. ప్రజల ఆరోగ్యం బావుందుంటే దానికి స్వచ్ఛ సేవకులే కారణమన్నారు. రాష్ట్రంలో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. 2లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని ఓడీఎఫ్‌ రాష్ట్రంగా మార్చామన్నారు.

నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై ఉపసంఘం ఏర్పాటు చేశారని.. దీనికి తాను ఛైర్మన్‌గా ఉన్నానని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014 అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారని.. దీనికి అందరం ఆయనకు అభినందనలు తెలియజేయాలన్నారు. కొందరు స్వార్థ పరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని.. ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుందన్నారు ముఖ్యమంత్రి. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు.

గతంలో తాము గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ సెంటర్లను ఏర్పాటు చేశామని.. అయితే చెత్తను తీసుకుపోవడం మానేసి, షెడ్లకు సొంతానికి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ షెడ్‌లకు కేంద్రం డబ్బులు ఇచ్చిందని.. వాటిని కూడా ఇష్టం వచ్చినట్లు చేసి నిధులు లేకుండా చేశారని ఆరోపించారు కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లు రెండు మాత్రం పని చేస్తున్నాయని.. మిగతా అన్ని ఫ్లాంట్లు పనికి రాకుండా చేశారని మండిపడ్డారు. మళ్లీ చెత్త నుంచి కరెంటు తయారీ ప్లాంట్లను పునరుద్ధరిస్తామని చెప్పారు.

You cannot copy content of this page