రాష్ట్రంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్న ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు బంద్ కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్న గత సర్కార్ ఇచ్చిన నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా జీవో జారీ చేశారు.
గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానం తీసుకొచ్చింది. స్థానికంగా ప్రజలు గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునే వ్యవస్థలను ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా… గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల వ్యవస్థను రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.
ఈ విధానానికి క్రయ, విక్రయదారుల నుంచి స్పందన తక్కువగా ఉందని గుర్తించారు. గడిచిన రెండేళ్లలో సుమారు 3700 గ్రామ సచివాలయాల్లో ఈ విధానం ప్రారంభించారు. అయితే ఇప్పటివరకూ 5 వేల రిజిస్ట్రేషన్లే జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.
వీటి వల్ల అదనంగా ఖర్చు, మానవ వనరుల వృథాతో పాటు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ నివేదకను సమర్పించారు.గ్రామాల్లోని సచివాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నామమాత్రంగా సాగుతోందని నివేదిలో ప్రస్తావించినట్లు తెలిసింది.
దీని అమలు కోసం గ్రామ సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ చేసే అధికారాలు కల్పించింది.
అయితే కేవలం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రమే ఎక్కువగా సచివాలయాల్లో జరిగాయి. అంతేతప్ప సాధారణంగా జరిగే భూముల క్రయ, విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది.
దీంతో కూటమి ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల వ్యవస్థకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ తాజాగా రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.