ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్ తీసుకోవడానికి బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలివే
ఇంటి నుంచి నేరుగా దరఖాస్తు చేసుకుని రుణం పొందే అవకాశం..
- చదువుకోవాలనే తపన ఉన్నా.. ఆర్థిక కష్టాల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న వారి సంఖ్య భారీగా ఉంటున్న విషయం తెలిసిందే. కొంతమంది అయితే విద్యారుణం (Education Loan) వైపు అడుగులు వేస్తారు. అయితే.. వీళ్లు లోన్ పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలనే భావన ఉంది.
- అయితే.. ప్రస్తుతం ఆ అవసరం లేకుండా ఇంటి నుంచి నేరుగా దరఖాస్తు చేసుకుని రుణం పొందే అవకాశం విద్యాలక్ష్మి పథకం కల్పిస్తోంది.
ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది..
- విద్యార్థులకు సులువుగా, అతి తక్కువ వడ్డీతో.. ఎలాంటి హామీ అవసరం లేకుండా.. విద్యా రుణం అందించాలనే ఆలోచనతో కేంద్రప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ 2015-16 ఆర్థిక సంవత్సరంలో ‘విద్యాలక్ష్మి పోర్టల్ ‘ను ప్రారంభించింది.
- విద్యారుణం కావాలంటే సాధారణంగా అభ్యర్థి బ్యాంకుకు వెళ్లాలి. కానీ ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే… అభ్యర్ధి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.
- ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఒక్కసారి దరఖాస్తు చేస్తే.. మూడు బ్యాంకుల్లో మూడు రకాల విద్యారుణాలకు దరఖాస్తు చేసుకున్నట్టే.
ఎలాంటి హామీ లేకుండా మొత్తం మూడు రకాల రుణాలు..
- రూ.4 లక్షలలోపు
- రూ.4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల లోపు
- రూ.7.5 లక్షల పైన
వీటిపై వడ్డీ కూడా మిగతా విద్యా రుణాలతో పోలిస్తే తక్కువ. పైగా ఎలాంటి హామీ లేకుండా రుణం సౌకర్యం పొందొచ్చు. రూ.7.50 లక్షల రుణం వరకూ హామీ అవసరం ఉండదు. అయితే ఈ హామీరహిత రుణాన్ని పొందడానికి విద్యార్ధి కుటుంబ వార్షికాదాయం రూ.4.50 లక్షల లోపు ఉండాలి.
అప్లై చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్..
- విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు. ఉదా: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ.
- చివరిసారిగా చదివిన కోర్సుకు చెందిన ఉత్తీర్ణత పత్రం.
- చేరబోయే కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ పత్రాలు.
- కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం.
ఈ సర్టిఫికెట్లు అన్నింటినీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అలాగే ఫస్ట్ క్లాస్లో పాసైనవాళ్లు లేదా నిర్ణీత శాతం మార్కులు సాధించినవాళ్లే దరఖాస్తు చేయాలనే నియమం ఏదీ లేదు. రుణానికి దరఖాస్తు చేయడానికి ముందు ఏడాది చదివిన కోర్సు పాసైతే చాలు. అలాగే దరఖాస్తుకు గడువు తేదీ కూడా లేదు విద్యార్ధుల అవసరాలను బట్టి ఏడాది పొడవునా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు…
ఆన్లైన్ లో దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
- ముందుగా వెబ్సైట్ లింకులోకి వెళ్లి.. పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, చిరునామా.. లాంటి వివరాలతో రిజిష్టర్ చేసుకోవాలి. తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ (సీఈఎల్ఎఫ్)ను పూర్తిచేయాలి.
- అన్ని రకాల విద్యారుణాలకూ ఇది సరిపోతుంది. తర్వాత అవసరమైన సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి…
- ఒక విద్యార్ధి ఒక్క దరఖాస్తును మాత్రమే పంపాలి.
- అప్లికేషన్ స్టేటస్ ను విద్యాలక్ష్మి పోర్టల్లో బ్యాంక్ అప్డేట్ చేస్తుంది.
- రుణం మంజూరైందీ లేనిదీ పదిహేను రోజుల్లోనే తెలిసిపోతుంది.
- ఒక్కోసారి దరఖాస్తును ఆన్ హోల్డ్ లో పెడతారు. అలాంటప్పుడు అవసరమైన అదనపు సమాచారాన్నీ లేదా సర్టిఫికెట్లను అభ్యర్థి అప్లోడ్ చేయాలి. ఈ విషయాన్ని పోర్టల్ లోని డాష్బోర్డ్లో చూసి విద్యార్ధి తెలుసుకోవచ్చు.
- రుణం మంజూరైన విషయాన్నీ ఇదేవిధంగా పోర్టల్లోని డాష్బోర్డ్లో తెలియజేస్తారు.
- రుణం మొత్తాన్ని నేరుగా విద్యార్ధి బ్యాంకు అకౌంట్లోనే జమ చేస్తారు.
వివిధ రకాల ముఖ్యమైన రుణాలు ఇవే…
వివిధ రకాల రుణాలు అందుబాటులో ఉన్నప్పటికీ వీటిలో ఐదు ముఖ్యమైనవి.
1. టెక్నికల్ కోర్సెస్ లోన్: ఇంజినీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సులు చదివేవారికి.
2. ఒకేషనల్ కోర్సెస్ లోన్: వృత్తివిద్యా సంబంధమైన కోర్సులు చదివేవారికి.
3. ప్రొషెషనల్ డిగ్రీన్ లోన్: ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, లా, ఛార్బర్డ్ అకౌంటెన్సీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసేవారికి.
4. డిగ్రీ ప్రోగ్రామ్స్ లోన్: అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులకు
5. స్టడీస్ అబ్రాడ్ లోన్: విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునేవారికి, మంజూరు చేసే రుణంలో చదువుకోవడానికి అయ్యే ఖర్చులు మాత్రమే కాకుండా ట్యూషన్ ఫీజు, వసతి, రవాణా ఖర్చులన్నింటినీ కలుపుతారు.
- రుణాలను మంజూరు చేయడానికి సాధారణంగా ప్రాసెసింగ్ ఛార్జీలు అవసరమవుతుంటాయి. కానీ ఇక్కడ దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు ఏమీ ఉండవు. అంతా పారదర్శకంగానే ఉంటుంది.
- వడ్డీ రేటు తక్కువ. అయితే ఈ రేటు అన్ని బ్యాంకులకూ ఒకే విధంగా ఉండదు. స్కీములు, బ్యాంకులను బట్టి వడ్డీ రేటులో తేడా ఉంటుంది..
Leave a Reply