పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1876 – జూలై 4, 1963), స్వాతంత్య్ర సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.
బాల్యం, విద్యాబ్యాసం
పింగళి వెంకయ్య, కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో 1878 ఆగష్టు 2వ తేదీన జన్మించారు. తండ్రి హనుమంతరాయుడు గారు దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణం. మాతామహులైన అడివి వెంకటాచలంగారు చల్లపల్లి సంస్థానం ఠాణేదారు. ఆయనకు పెదకళ్ళేపల్లి బదిలీ కావటం వల్ల వెంకయ్యగారి ప్రాథమిక విద్య అక్కడే పూర్తి అయింది. బందరులో హైస్కూలు చదువు పూర్తి చేశారు. చొరవ, సాహసం మూర్తీభవించిన ఆ వెంకయ్యగారు బొంబాయి వెళ్ళి, 19వ ఏట సైన్యంలో జేరి దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. స్వదేశం వస్తూ అరేబియా, ఆఫ్టనిస్తాన్ లు చూచివచ్చారు.
మద్రాసులో ప్లేగ్ ఇన్స్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్ళారిలో ప్లేగ్ ఇన్స్పెక్టర్ గా పని చేశారు. ఆయన జ్ఞాన దాహం అంతులేనిది. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పాలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జి సీనియర్ పరీక్షలో నెగ్గారు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఏ.వి. కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్యగారిని ‘జపాన్ వెంకయ్య’ అనేవారు.
వ్యవసాయ శాస్త్ర పరిశోధన
రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యగారికి వ్యవసాయంపట్ల ఎంతో అభిరుచి వుండేది. ఆయన కాంగ్రెస్ సభలకు తరచుగా వెళ్ళేవారు. 1908లో దాదాభాయి నౌరోజి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సభలకు వెళ్ళారు. ఆ సభల్లోనే ముక్త్యాల రాజా నాయని రంగారావు బహద్దూర్ గారి పరిచయం కల్గింది. వ్యవసాయ రంగంలో అప్పటికే పరిశోధనలు సాగించిన వెంకయ్యగారితో పరిశోధనశాల నెలకొల్పారు. అమెరికా నుండి కంబోడియా ప్రత్తి విత్తనాలు తెప్పించి ప్రత్తిని పండించిన ఘనత వెంకయ్యగారికే చెల్లు. 1907 నుండి 1910 వరకు మునగాలలో ఉంటూ ‘వ్యవసాయ –
శాస్త్రం’ అనే గ్రంథాన్ని వ్రాశారు. అప్పుడాయనను ‘ప్రత్తి వెంకయ్య’ అనేవారు. వెంకయ్యగారికి, బ్రిటన్ లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ సభ్యత్వం లభించింది.
వెంకయ్యగారు బందరులోని జాతీయ కళాశాలలో 1911 నుండి 1919 వరకు అధ్యాపకులుగా పని చేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. ఈనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఎన్.సి.సి.’ శిక్షణోద్యమానికి 75 ఏళ్ళ క్రితమే శ్రీకారం చుట్టిన మహనీయుడు పింగళి వెంకయ్యగారు. అప్పట్లోనే చైనా జాతీయ నాయకుడైన ‘ సన్యెట్ సేన్ ‘ జీవిత చరిత్ర వ్రాసారు
1921లో విజయవాడలో (బెజవాడ) అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. గాంధీజీ కోరిక మేరకు వెంకయ్యగారు జాతీయ పతాకాన్ని తయారు చేసి ఇచ్చారు. 1921లోనే కాంగ్రెస్ సంస్థ ఆ పతాకాన్ని కాంగ్రెస్ పతాకగా ఆమోదించింది. 22.7.1947న భారత రాజ్యాంగసభ ఈ పతాకాన్ని ఆమోదించింది. నెహ్రూ సలహామేరకు త్రివర్ణ పతాకంలో రాట్నానికి బదులుగా ‘అశోక చక్రం’ ఉంచబడింది.
క్రమంగా వెంకయ్యగారు రాజకీయాల నుండి దూరమయ్యారు. మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి ‘ డిప్లామా’ తీసుకొన్నారు. తర్వాత నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశారు. వజ్రకరూరు (అనంతపురం జిల్లా హంపీ మున్నగు చోట్ల ఖనిజాలను అన్వేషిస్తూ
ప్రభుత్వానికి ఖనిజాల ఉనికిని గురించిన నివేదికలు పంపారు.
అంతవరకు బొగ్గు వజ్రంగా మారుతుందనుకొనేవారు. ప్రపంచంలో మొదటిసారిగ వజ్రపుతల్లి రాయిని కనుగొన్న పరిశోధకులు వెంకయ్యగారే. ఈ తల్లిరాయిని గురించి వెంకయ్యగారు ఆంగ్లంలో గ్రంథం వ్రాశారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞుఉలు వెంకయ్యగారి ప్రతిభా విశేషాలను ఎంతగానో కొనియాడారు. ప్రజలు వెంకయ్యగారిని ‘వజ్రాల వెంకయ్య’ అన్నారు.
వ్యక్తి గా వెంకయ్య గారు
దేశభక్తి భావనా సంపన్నులైన వెంకయ్యగారు, దక్షిణాఫ్రికా నుండి వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలోని రహస్య విప్లవ సంఘాల్లో అయిదేళ్ళకుపైగా పని చేశారు.
భారతదేశాన్ని పారిశ్రామికంగా జపాన్ తో దీటుగా పెంపొందించాలని ఆశించారు. వెంకయ్యగారు ఆరడుగుల ఎత్తుండేవారు. నల్లని రంగులో ఉక్కు మనిషిలా ఉండేవారు. కంచులాంటి కంఠస్వరం, నిష్కళంక దేశభక్తుడు. అవినీతిని, అన్యాయాన్ని ఏ మాత్రం సహించేవారు కాదు.
పింగళి వారు మహారాష్ట్ర ప్రాంతం నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చినవారు. పింగళి మోరు పంతు వంశీయులు. వీరనారి రూన్సీ లక్ష్మీబాయి పింగళివారి ఇంటి ఆడపడుచు. నైజాం నవాబు వద్ద మహాసేనానిగా పనిచేసిన పింగళి మాదన్నగారి వంశీయుడే వెంకయ్యగారు. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం.
మన జాతికొక కేతనాన్ని నిర్మించిన వాడాయన,. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యగారిని గుర్తించకపోవటం శోచకీయం. జాతీయ పతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్యగారి పేరును సూచించకపోవడం విచారకరం.
తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజ వేయలేదు. జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్యగారు చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ‘ తివేణి ‘ సంపాదకులు డా. భావరాజు నరంసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.
టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, డా. గూడూరు నమశ్శివాయ మున్నగు పెద్దలు 15.1.1963న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తర్వాత ఆరు నెలలకే 4.7.1963వ తేదీన వెంకయ్యగారు దివంగతులయ్యారు.
కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ “నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ వున్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక” అన్నారు.
Leave a Reply