Telangana History for Competitive Exams – కుతుబ్‌షాహీ యుగం

పదిహేనో శతాబ్దం చివరి నాటికి క్షీణ దశకు చేరిన బహమనీ సామ్రాజ్యం అయిదు రాజ్యాలుగా చీలిపోయింది. అందులో గోల్కొండ కుతుబ్‌షాహీ రాజ్యం ఒకటి. ఈ రాజ్యస్థాపకుడు సుల్తాన్‌ కులీకుతుబ్‌షా. ఇతడు 1496 నుంచి 1518 వరకుసుబేదార్‌గా తెలంగాణ ప్రాంతాన్ని పాలించాడు. 1518లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కుతుబ్‌షాహీలు తొలుత తెలంగాణను పాలించారు. 1565లో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇతర తెలుగు ప్రాంతాలు కూడా వీరి ఆధీనంలోకి వచ్చాయి. తెలంగాణ అనే పదం వీరి కాలం నుంచే  ప్రాచుర్యం పొందింది. కుతుబ్‌షాహీలు సుమారు రెండు శతాబ్దాల (1496–1687) పాటు తెలంగాణను పాలించారు. వీరు తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను ఆదరించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.

కుతుబ్‌షాహీ యుగం

కులీకుతుబ్‌షా తన బంధువులతో కలసి మధ్య ఆసియా నుంచి దక్కన్‌కు వలస వచ్చాడు. ఇతడు బహమనీ సుల్తాన్‌ మహమూద్‌ షా (1482–1518) కొలువులో చేరి సేనాపతి అయ్యాడు. ఆ సమయంలో ఇతడు తెలంగాణ ప్రాంతంలో దోపిడీ దొంగలను అణచివేశాడు. ఎదురు తిరిగిన సామంతులను దారిలోకి తెచ్చాడు. 1487లో బహమనీ రాజ్యంలో దక్కనీ, అఫాకీ(స్థానికేతర)ల మధ్య ఘర్షణలు తలెత్తాయి. కులీ వీటి నుంచి సుల్తాన్‌ను రక్షించాడు. గోవా పాలకుడైన బహదూర్‌ జిలానీ (1493) సుల్తాన్‌పై తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటును అణచివేసే ప్రయత్నంలో నాటి తెలంగాణ పాలకుడైన కుతుబ్‌ ఉల్‌ముల్క్‌ డకానీ మరణించాడు. దీంతో మహమూద్‌ షా ఆ బాధ్యతను కులీకుతుబ్‌షాకు అప్పగించాడు. తిరుగుబాటును కులీ పూర్తిగా అణచి వేశాడు.దీంతో మహమూద్‌షా అతడికి కుతుబ్‌ ఉల్‌ముల్క్‌ బిరుదునిచ్చి 1496లో గోల్కొండ జాగీర్‌దార్‌గా నియమించాడు. కులీకుతుబ్‌షా 1518లో స్వతంత్రం ప్రకటించుకొని తెలంగాణ ప్రాంతాన్ని పాలించాడు. గోల్కొండను కాకతీయుల కాలంలో నిర్మించారు. దీన్ని గతంలో మంగళారం అని పిలిచేవారు. కులీ స్వతంత్రంగా పాలన చేపట్టిన తొలినాళ్లలో మెదక్‌ జిల్లా కోహిర్‌ నుంచి ఓరుగల్లు వరకు మాత్రమే ఇతడి పాలనలో ఉండేది. ఓరుగల్లు నుంచి తూర్పు తీరం వరకు ఉన్న ప్రాంతాన్ని షితాబ్‌ఖాన్‌ (సీతాపతిరాజు) పాలించేవాడు. ఇతడు గజపతుల సామంతుడు. షితాబ్‌ఖాన్‌ 1504 లో ఓరుగల్లు కోటను కైవసం చేసుకున్నాడు. ఇతడు స్వతంత్రంగా ఓరుగల్లు రాజ్యపాలన చేపట్టాడు. ఇతడి మంత్రి ఎనుములపల్లి పెద్దనామాత్యుడు. చరిగొండ ధర్మన్న అనే కవి పెద్దనామాత్యుడి వద్ద ఆశ్రయం పొందాడు. ధర్మన్న రచించిన చిత్రభారతంలో షితాబ్‌ఖాన్‌ ప్రశంస కనిపిస్తుంది. వరంగల్,ఖమ్మం మెట్టు,నల్లగొండ ప్రాంతాలు షితాబ్‌ఖాన్‌ రాజ్యంలో భాగంగా ఉండేవి. కులీకుతుబ్‌షా ఓరుగల్లుపై దాడి చేసి ఇతణ్ని సంహరించాడు. 

రాచకొండ, పానుగల్లు, ఘనపురం (మహబూబ్‌నగర్‌), దేవరకొండ, నల్లగొండ, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అనంతగిరి దుర్గాధిపతులు స్వతంత్రంగా పరిపాలించేవారు. కృష్ణదేవరాయల మరణానంతరం (1529) కులీకుతుబ్‌షా ఈ దుర్గాలను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత కరీంనగర్‌ జిల్లాలో కివాం ఉల్‌ముల్క్‌ను ఓడించాడు. ములంగూర్, ఎల్గందుల, రామగిరి కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఆదిల్‌షాతో యుద్ధం చేసి కోవిలకొండను ఆక్రమించాడు. హరిచంద్‌ తిరుగుబాటును అణచి నల్లగొండను వశం చేసుకున్నాడు. తర్వాత కృష్ణానదీ తీరం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. కొండపల్లి, ఇంద్రకొండ, ఏతగిరి, దుర్గాధీశులను ఓడించాడు. దీంతో కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న తీరాంధ్ర కూడా ఇతడి పాలనలోకి వచ్చింది. కులీకుతుబ్‌షా కవి పండితులను ఆదరించాడు. ఇతడికి ఆరుగురు కుమారులు. చివరి వాడైన ఇబ్రహీం కుతుబ్‌షాను దేవరకొండ పాలకుడిగా నియమించాడు.
యువరాజు, పెద్ద కుమారుడైన హైదర్‌ ముందే మరణించాడు. రెండో కుమారుడైన కుతుబుద్దీన్‌ యువరాజు అయ్యాడు. కానీ రాజకీయాల పట్ల శ్రద్ధ పెట్టలేదు. మిగతా ముగ్గురు తండ్రి బతికుండగానే సింహాసనాన్ని ఆకాంక్షించారు. నాలుగో కుమారుడైన అబ్దుల్‌ కరీం తిరుగుబాటు చేశాడు. ఇతడు బీజాపూర్‌ వెళ్లి సుల్తాన్‌తో సంప్రదింపులు జరిపాడు. గోల్కొండను ముట్టడించాలని భావించాడు. ఆ ప్రయత్నాల్లోనే మరణించాడు. కులీకుతుబ్‌షా మూడో కుమారుడైన జంషీద్, అయిదో కుమారుడైన దౌలత్‌ వారసత్వం కోసం కలహించుకున్నారు. దీంతో కులీకుతుబ్‌షా జంషీద్‌ను గోల్కొండలో, దౌలత్‌ను భువనగిరిలో బంధించాడు. జైలు నుంచి తప్పించుకున్న జంషీద్‌ తండ్రిని హత్య చేశాడు. సోదరుడైన కుతుబుద్దీన్‌ను చిత్రహింసలకు గురి చేసి జైళ్లో ఉంచాడు. అనంతరం సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇతడు రాజ్యాన్ని విస్తరించలేదు. కానీ తన రాజ్య భాగాలను కోల్పోలేదు.

మల్కిభరాముడు

కులీ ఆరో కుమారుడు ఇబ్రహీం కుతుబ్‌షా (1550–80). ఇతడు విజయనగర రాజుల సాయంతో సింహాసనాన్ని ఆక్రమించాడు. కవి పండితులను ఆదరించి మల్కిభరాముడిగా పేరొందాడు. ఇతడు విజయనగరంలో ఏడేళ్లపాటు శరణార్థిగా ఉన్నాడు. వారి సహాయంతోనే సింహాసనాన్ని ఆక్రమించాడు. కానీ వారి పతనానికే కారణమయ్యాడు. బీజాపూర్, అహ్మద్‌నగర్, గోల్కొండ, విజయనగర రాజులు దక్కన్‌పై ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇబ్రహీం తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో ఓటమి వల్ల విజయనగర సామ్రాజ్యం పతనావస్థకు చేరింది. దీంతో ఇబ్రహీం కుతుబ్‌షా తీరాంధ్రను జయించడానికి మార్గం సుగమమైంది. ఇతడు 1571లో రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాలను జయించాడు. 1579లో కొండవీటిని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత వినుకొండ, ఖమ్మం దుర్గాలను, కసింకోటను వశం చేసుకున్నాడు.
ఇబ్రహీం కుతుబ్‌షా తన పాలనా కాలంలో హుస్సేన్‌సాగర్, ఇబ్రహీం పట్నం చెరువులను తవ్వించాడు. ఇబ్రహీంబాగ్, పూల్‌బాగ్, లంగర్‌ (భిక్షా గృహాలు)ను ఏర్పాటు చేశాడు. మూసీనదిపై పురానాపూల్‌ వంతెనను నిర్మించాడు.
ఇబ్రహీం మరణానంతరం మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా (1580–1612) అధికారం చేపట్టాడు. ఇతడు 14వ ఏట రాజ్యానికొచ్చాడు. ఇతడు ఇబ్రహీం, భాగీరథిల సంతానం. దక్కన్‌ ముస్లింల సహకారంతో అశ్వారావు చేసిన కృషి వల్ల మహమ్మద్‌ కులీ అ«ధికారంలోకి వచ్చాడు. ఇతడు కవి అయినప్పటికీ రాజ్య విస్తరణలో అలక్ష్యం ప్రదర్శించలేదు. దక్షిణాన పెనుగొండ, గండికోటలను జయించాడు. తూర్పున శ్రీకాకుళం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. అనేక తిరుగుబాట్లను అణచివేశాడు. 1592లో రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. ఇదే సమయంలో మొగలులు విజృంభించి 1590 నాటికి ఉత్తర భారతాన్నంతా ఆక్రమించారు.
అనంతరం వారు దక్కన్‌పై దృష్టి సారించి అహ్మద్‌నగర్‌ను వశపర్చుకున్నారు. ఈ ప్రభావం మహమ్మద్‌ కులీపై కూడా పడింది. ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇవేవీ కులీ కళాపోషణను ప్రభావితం చేయలేదు. తన ప్రియురాలైన భాగమతి పేరు మీద భాగ్యనగరాన్ని నిర్మించాడు. కులీ ఆమెకు హైదర్‌ మహెబ్‌ అనే పేరు పెట్టాడు. దీంతో భాగ్యనగరం హైదరాబాద్‌గా వ్యవహారంలోకి వచ్చింది.
ఇతడు చార్మినార్‌(1591),చార్‌కమాన్‌(1592), జామామసీద్‌ (1597–1598)లను నిర్మించాడు. దారుల్‌ షిఫా, దాద్‌ మహల్, ఖుదాదాద్‌ మహల్, నద్ది మహల్‌లను నిర్మించాడు. భాగెమహమ్మది, బన్నత్‌ ఘాట్, కోహినూర్‌ తదితర నిర్మాణాలు చేపట్టాడు. ఇవన్నీ ఇతడి కళాభిరుచికి నిదర్శనం.
కులీ మరణం తర్వాత అతడి అల్లుడయిన సుల్తాన్‌ మహమ్మద్‌ కుతుబ్‌షా(1612–26) సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు మొగలులతో సఖ్యతగా వ్యవహరించాడు. ఇతడి కాలంలోనే డచ్చివారు, బ్రిటిషర్లు తీరాంధ్ర వెంట వర్తక స్థావరాల్ని నెలకొల్పారు. మహమ్మద్‌ కుతుబ్‌షా ఖైరతాబాద్‌ మసీద్‌ను నిర్మించాడు. మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేశాడు.1624లో ఈద్గాను నిర్మించాడు. అమ్మాన్‌ భవనం, నబీబాగ్‌ కూడా ఇతడి కాలం నాటివే.

పతనం ఆరంభం..

మహమ్మద్‌ తర్వాత అతడి పెద్ద కుమారుడైన అబ్దుల్లా కుతుబ్‌షా(1626–72) రాజ్యానికి వచ్చాడు. ఇతడు మొగలుల నుంచి స్వతంత్రతను నిలబెట్టుకోలేకపోయాడు. దక్కన్‌లో మొగలులను ఎదిరించిన మలికంబర్‌ 1626లో, బీజాపూర్‌ సుల్తాన్‌ ఇబ్రహీం ఆదిల్‌ షా 1627లో మరణించారు. వీరి మరణంతోపాటు కొన్ని ఇతర కారణాల వల్ల దక్కన్‌పై మొగలుల దండయాత్రకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
మొగల్‌æ చక్రవర్తి షాజహాన్‌ 1636లో గోల్కొండపై దండెత్తాడు. అబ్దుల్లా కుతుబ్‌షా అతడితో సంధి చేసుకుని మొగలుల ఆధిపత్యాన్ని అంగీకరించాడు. నాటి నుంచి కుతుబ్‌షాహి రాజ్య క్షీణదశ ప్రారంభమైంది. అబ్దుల్లా ఒకవైపు సామంతుడిగా ఉంటూనే కర్ణాటక రాజ్యంపై ఆధిపత్యం కోసం ప్రయత్నించాడు. తన సేనాని మహ్మద్‌ సయీద్‌ మీర్‌జుంలాను 1645లో కర్ణాటకపై దండయాత్రకు పంపాడు. ఫలితంగా కర్ణాటక రాజ్య తూర్పు భాగాలు అబ్దుల్లా రాజ్యంలో భాగమయ్యాయి. 1653లో విశాఖపట్టణం సుల్తాన్‌ వశమైంది. తీరాంధ్ర గోల్కొండ సామ్రాజ్యంలో విలీనమైంది. ఈ విజయాలతో విదేశీ వర్తకుల వ్యాపార స్థావరాలు గోల్కొండ రాజ్య పరిధిలోకి వచ్చాయి. దీంతో వారికి గోల్కొండ రాజ్యంతో సంబంధాలు ఏర్పడ్డాయి. 
కర్ణాటక విజయాలతో అబ్దుల్లా సేనాని మహమ్మద్‌ సయీద్‌లో అత్యాశ మొదలైంది. ఇతడు తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. దక్కన్‌ సుబేదార్, షాజహాన్‌ కుమారుడైన ఔరంగజేబుకు చాడీలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఔరంగజేబు 1656లో గోల్కొండపై దండెత్తాడు. అబ్దుల్లా కుతుబ్‌షా అతి కష్టం మీద ఔరంగజేబుతో సంధి చేసుకున్నాడు. కుతుబ్‌షా తన రెండో కుమార్తెను ఔరంగజేబు కుమారుడైన మహమ్మద్‌ సుల్తాన్‌కు ఇవ్వడానికి అంగీకరించాడు. మహమ్మద్‌ను తన వారసుడిగా ప్రకటించడానికి, కోటి హొన్నులు కప్పం కట్టడానికి అబ్దుల్లా ఒప్పుకున్నాడు. దీంతో గోల్కొండలో మొగల్‌ అధికారుల ఆధిపత్యం పెరిగింది. ఫలితంగా గోల్కొండ రాజ్యం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ సంక్షోభాన్ని అదనుగా భావించిన ఐరోపా కంపెనీలు కుతుబ్‌షాహీల పట్ల అవిధేయంగా ప్రవర్తించాయి. సంక్షోభానంతరం అబ్దుల్లా వారిని దారిలోకి తెచ్చుకున్నాడు.

తానీషా పాలన

1672లో అబ్దుల్లా మరణించడంతో వారసత్వ వివాదం ఏర్పడింది. అనూహ్య పరిస్థితుల్లో అబుల్‌హసన్‌ తానీషా (1672–87) కుతుబ్‌షాహీ రాజ్య వారసుడయ్యాడు. తానీషా సుల్తాన్‌ పదవిని చేపట్టగానే ఔరంగజేబుకు అనేక కానుకలు పంపాడు. మొగలులకు సామంతుడిగా ఉండేందుకు అంగీకరించాడు. ఇందుకు ఔరంగజేబు ఒప్పుకున్నాడు. కానీ తానీషా శివాజీకి సహాయపడకూడదని, పేష్కను సమయానికి చెల్లించాలని షరతులు విధించాడు. మొగలులతో ఎప్పటికైనా ప్రమాదమేనని తానీషా భావించాడు. అందుకే రాజ్యాన్ని పటిష్టం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. తాను అధికారంలోకి రావడానికి తోడ్పడిన ముజఫర్‌ను మీర్‌ జుమ్లా (ప్రధానమంత్రి)గా నియమించాడు. కానీ అతడు అన్ని వ్యవహారాల్లో తలదూర్చేవాడు. అది సహించని తానీషా ముజఫర్‌ను తొలగించాడు. హనుమకొండకు చెందిన మాదన్నను ప్రధానిగా, అక్కన్నను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. మాదన్న రాజ్య వ్యవహారాలను చక్కదిద్దాడు. కర్ణాటక ప్రాంతంలో పాశ్చాత్య వర్తకులు సృషించిన అలజడులను అణచివేశాడు. తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకున్నాడు. ఉన్నత పదవుల నుంచి స్థానికేతరులను తొలగించి స్థానికులను నియమించాడు. నీటి వనరుల నిర్మాణాలు చేపట్టి వ్యవసాయభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాడు. దళారీలను తొలగించి రైతులపై జరిగే దౌర్జన్యాలను అరికట్టాడు. గనులను పునరుద్ధరించి రాజ్య సంపదను పెంచాడు.

ఔరంగజేబు దండయాత్ర

ఇదే సమయంలో ఔరంగజేబు దక్కన్‌ రాజ్యాలన్నింటినీ నిర్మూలించడానికి ఉద్యుక్తుడయ్యాడు. మొగలుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి తానీషా 1677లో శివాజీతో సంధి చేసుకున్నాడు. ఈ సంధి కుదరడంలో అక్కన్న మాదన్నలు ముఖ్య పాత్ర పోషించారు. ఇది ఔరంగజేబు ఆగ్రహానికి కారణమైంది. కొంత కాలానికి శివాజీ మరణించాడు. దీంతో ఔరంగజేబు అదను చూసుకొని 1685లో గోల్కొండపై దండెత్తాడు. మొగలు సైన్యానికి ఔరంగజేబు కుమారుడైన షా ఆలం నాయకత్వం వహించాడు.
మొదట గోల్కొండకే విజయం లభించింది. కానీ సేనానుల నమ్మక ద్రోహంతో గోల్కొండ ఓడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో తానీషా మొగలులతో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం పాత బకాయిల కింద మొగలులకు కోటి హొన్నులు చెల్లించాలి. ఏటా రెండు లక్షల హొన్నుల కప్పం చెల్లించాలి. మల్ఖేడు, సేడం ప్రాంతాలను మొగలులకు అప్పగించాలి. అక్కన్న మాదన్నలను పదవుల నుంచి తొలగించాలి. మొదటి మూడు షరతులను తానీషా అమలు చేశాడు.
కానీ అక్కన్న మాదన్నలను తొలగించడంలో ఆలస్యం చేశాడు. ఇది సహించని ముస్లిం సర్దార్లు 1686 మార్చి 24 రాత్రి అక్కన్న మాదన్నలను హత్య చేశారు. వారి తలలను ఔరంగజేబుకు కానుకగా పంపారు. అయినా ఔరంగజేబు సంతృప్తి చెందలేదు. బీజాపూర్‌ ఆక్రమణ అనంతరం 1687 ఫిబ్రవరి 7న మళ్లీ గోల్కొండపై దండెత్తాడు. ఎనిమిది నెలల హోరాహోరీ యుద్ధం తర్వాత ఒక సేనాని ద్రోహంతో గోల్కొండ మొగలుల వశమైంది. అబుల్‌ హసన్‌ తానీషాను బంధించి దౌలతాబాద్‌ కోటకు తరలించారు. దీంతో కుతుబ్‌షాహీల పాలన అంతరించింది. గోల్కొండ రాజ్యం మొగల్‌ సామ్రాజ్యంలో భాగమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page